గోదావరి కాలుష్య నివారణపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు....
రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించి గోదావరి తీర ప్రాంతాల్లోని కాలుష్య పరిస్థితులు, పుష్కరాల అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. ఈ పరిశీలనలో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహిత గోదావరి థీమ్‌తో నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గోదావరిలో కలిసే మురుగునీరు, కాలుష్యకారక వ్యర్థాల నిర్వహణపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా అధికారులను ఆదేశించారు. గోదావరిలోకి రోజుకు సుమారు 55 ఎంఎల్‌డీ మురుగునీరు చేరుతున్న నేపథ్యంలో శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చర్యలు చేపట్టాలని సూచించారు. చింతలమ్మ ఘాట్ వద్ద మురుగునీరు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుతం అమలవుతున్న వ్యర్థజల శుద్ధి విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించి, శుద్ధి చేసిన నీటినే గోదావరిలోకి విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థజలాల నిర్వహణపై కూడా ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రత్యామ్నాయ శుద్ధి వ్యవస్థలను వేగంగా అమలు చేసేలా సంస్థ యాజమాన్యానికి సూచనలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
