నూకాంబిక జాతరలో కట్టుదిట్టమైన బందోబస్తు – సీఐ విద్యాసాగర్ పర్యవేక్షణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో జరుగుతున్న శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర తీర్థ మహోత్సవం సందర్భంగా భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం మరియు శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.జాతర ప్రాంగణంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సీఐ విద్యాసాగర్ స్వయంగా పర్యవేక్షణ చేపట్టారు. ముఖ్యంగా క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాలు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పోలీసులు నిరంతరం పహారా కాస్తూ భక్తులకు భద్రత కల్పిస్తున్నారు.మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ, భక్తుల రాకపోకలను సజావుగా నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే చర్యలు తీసుకునేలా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

అనంతరం సీఐ విద్యాసాగర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేందుకు పోలీసు శాఖ పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు.