*సాంప్రదాయ పేరుతో సామాన్యుడి జేబుకు చిల్లు*
*అధికార ప్రభుత్వ అండ దండలతో కోడి పందాలు గుండాట నిర్వహణ.*
అమలాపురం ,సత్యం డిజిటల్ న్యూస్,15/1/26:
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి వేడుకలు అనగానే వెంటనే గుర్తొచ్చేది కోడిపందేలు. ఈ సంప్రదాయం ప్రతి సంవత్సరం అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. పొరుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా విదేశాలలో స్థిరపడిన వారు కూడా ఈ పోటీలను చూడటానికి పండుగ సమయంలో తమ స్వగ్రామాలకు తిరిగి వస్తారు. కోడిని జాగ్రత్తగా సెలక్ట్ చేసుకోవడం, ప్రత్యేక శిక్షణ ఇవ్వడం నుండి కఠినమైన ఆహారం, ఫైట్ వరకు.. కోడి జీవితంలోని ప్రతి అంశాన్ని పద్ధతి, ప్లానింగ్ ప్రకారం చూస్తారు.
ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు ముఖ్యంగా కోడి పందాలకు ప్రధాన కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇది సంక్రాంతి పండుగ సమయంలో సాంప్రదాయ గ్రామీణ క్రీడగా ప్రారంభమైంది. కానీ ఇప్పుడు సంక్రాంతి పండుగ రోజుల్లో కోట్ల రూపాయల పందేలతో కూడిన పెద్ద ఎత్తున జూదంగా మారింది. ఇదే అసలు సమస్యగా మారింది.
చాలా ప్రాంతాలు పక్షుల కాళ్లకు కట్టిన కత్తులను ఉపయోగిస్తుండగా.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు కత్తులు లేని పోటీలను నిర్వహిస్తాయి. ఇక్కడ కోళ్లకు సహజంగా పెరిగిన ముల్లును పదును పెట్టి ఆయుధంగా ఉపయోగిస్తారు.
*హైకోర్టు సీరియస్*
మరోవైపు కోడిపందేలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోడి పందేలు నిర్వహించే వారిపై జంతు హింస నిరోధక చట్టం 1960, ఏపీ జూద నిరోధక చట్టాలనుకఠినంగా అమలు చేయాలని హైకోర్టు.కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. గ్రామాల్లో సభలు నిర్వహించాలని, చట్ట నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపింది. కోడి పందాల బరుల దగ్గర కోడి కత్తులు, ఇతర పందెం సామగ్రి, సొమ్మును వెంటనే స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. అవసరమైతే 144 సెక్షన్ అమలు చేయాలని కోర్టు పేర్కొంది.ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే.. వ్యక్తిగతంగా అధికారులే బాధ్యత వహించాలని హైకోర్టు తెలిపింది. కోడి పందేల గురించి తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని, ఇందులో తహసీల్దార్, ఎస్సై ర్యాంకుకు తగ్గని పోలీసు అధికారి, భారత జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా జంతు సంరక్షణకు పనిచేసే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉండాలని చెప్పింది. తనిఖీలకు వెళ్లే సమయంలో ఇద్దరు పోలీసులు, ఒక ఫొటోగ్రాఫర్ సహాయకులుగా ఉండాలని ఆదేశించింది.అయితే దానికి బిన్నంగా అధికార పార్టీ నాయకుల అండ దండలతో వాడపల్లి చైర్మన్ ముఖ్య అతిథిగా ముదునూరి సాయిరాజు ఆద్వర్యం లో కోనసీమ సాంప్రదాయం పేరుతో ఏర్పాటు చేసిన కోడిపందాల బరి లో లక్షల రూపాయలు ధనం తో కోడి పందాలు గుండాట వంటి అనేక ప్రజల జేబుకు చిల్లు పెట్టే విధంగా సంక్రాంతి పేరు మీద దోచుకుంటున్న ఈ బడా బాబులు ను ఆపే వారెవరు అని స్థానికులు అంటున్నారు దీనిపై అధికారులు ఇప్పటికయినా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే స్థానిక అధికారుల పై హై కోర్ట్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.

