పలివెలలో మహాశివరాత్రి వేడుకలు.... అధికారులను సత్కరించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రమైన పలివెల శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి దేవస్థానంలో వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
వేడుకలు విజయవంతంగా సాగేందుకు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మయూరి సుబ్బారావు,ఈఓ కామేశ్వరరావు ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. గ్రామస్తులు, గ్రామ పెద్దలను కూడా కలుపుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నీటి సౌకర్యం, క్యూలైన్లు, పారిశుధ్యం, భద్రత వంటి అంశాల్లో సమగ్ర చర్యలు తీసుకున్నారు.
ఈ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆలయ ఈఓ కామేశ్వరరావు, ఎస్‌ఐ సురేంద్రలను ప్రత్యేకంగా సత్కరించారు. భక్తులకు చక్కటి సౌకర్యాలు కల్పించినందుకు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, ఆలయ ఈఓ, పోలీసు అధికారులను అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు విచ్చేసినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహణ చేయడం అభినందనీయమన్నారు. తెల్లవారు జామునుంచే విధుల్లో నిమగ్నమైన ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కృషిని కొనియాడారు.
ప్రత్యేకంగా పలివెల సచివాలయం మహిళా పోలీసు సిబ్బంది సేవలను ప్రశంసిస్తూ, మహిళా భక్తుల భద్రత కోసం వారు తీసుకున్న చర్యలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు
