IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్‌తో జరుగుతున్న హై వోల్టేజీ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 27 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసి భారత్‌కు భారీ స్కోరు దిశగా బాటలు వేశాడు.
పాక్ బౌలర్లను దంచికొట్టాడు.
శ్రీలంకలోని కొలంబోలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-A మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, పాక్ బౌలర్ల అంచనాలను తలకిందులు చేస్తూ భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే బాదుడు మొదలుపెట్టాడు. తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు.
ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే సల్మాన్ ఆఘా బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిదికి క్యాచ్ ఇచ్చి అబిషేక్ పెవిలియన్ చేరాడు. ఎదుర్కొన్న 4 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ అయ్యాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో అభిషేక్ సున్నాకే పరిమితం కావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. కేవలం 1 పరుగు వద్దే భారత్ తొలి వికెట్ కోల్పోవడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
తొలి వికెట్ త్వరగా పడినా ఇషాన్ కిషన్ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాలేదు. తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతూనే పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. షాహీన్ అఫ్రిది వేసిన ఓవర్‌లో ఒక సిక్సర్, ఒక ఫోర్ బాది 15 పరుగులు పిండుకున్నాడు. అనంతరం అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
