ఆలమూరు పోలీసుల సంచలనం: అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్



 – రూ.32.40 లక్షల బంగారం, వెండి స్వాధీనం  కేసును ఛేదించిన ఎస్సై నరేష్ బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా  బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం,ఆలమూరు,  రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతరాష్ట్ర దొంగల ముఠాను ఆలమూరు పోలీసులు అరెస్ట్ చేసి భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా (ఐపీఎస్) వివరాలు వెల్లడించారు. గత ఫిబ్రవరి 14న జత్తుక లక్ష్మీ పార్వతి అనే మహిళ ఫిర్యాదు మేరకు ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కంచెర్ల జార్జ్ బెన్నీ (22), సన్నపు శ్రీ చరణ్ (20) ఇద్దరూ ఆలమూరు మండలం పెద్దపళ్ళ గ్రామానికి చెందినవారు కాగా, ఉండుర్తి ఆనంద్ కుమార్ (22) కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామానికి చెందినవాడు. నిందితుల వద్ద నుండి పోలీసులు 203.650 గ్రాముల బంగారం, 765 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకోగా వాటి మొత్తం విలువ సుమారు రూ.32,40,000 ఉంటుందని అంచనా వేశారు. నిందితులలో ఒకరైన జార్జ్ బెన్నీపై గతంలో ఆలమూరు, రావులపాలెం పోలీస్ స్టేషన్లలో దొంగతనం మరియు గంజాయి కేసులు నమోదై ఉండగా, ఆనంద్ కుమార్‌పై కూడా గంజాయి కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌ను సమర్థవంతంగా నిర్వహించిన కొత్తపేట SDPO సుంకర మురళీ మోహన్, రావులపాలెం రూరల్ CI విద్యాసాగర్, అమలాపురం CCS CI గజేంద్ర కుమార్, ఆలమూరు SI నరేష్ మరియు వారి బృందాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రత్యేకంగా అభినందించారు.