కొత్తపేట నియోజకవర్గ టీడీపీ యువనాయకులు బొక్కా ప్రసాద్ఆంధ్రప్రదేశ్‌లో గతంలో బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కేటాయించిన రాజ్యసభ స్థానాలు ప్రస్తుతం ఇతర వర్గాలకు ఇవ్వబడుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ యువనాయకులు బొక్కా ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో నిజమైన సామాజిక న్యాయం అమలుకావాలంటే బీసీ వర్గాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.బీసీ సామాజిక వర్గాల అభివృద్ధిలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ స్థానం ప్రత్యేకమని ఆయన అన్నారు. బీసీల రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు, బీసీ రక్షణ చట్టం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ నాంది పలికిందని కొనియాడారు.గతంలో బీసీలకు కేటాయించిన రాజ్యసభ స్థానాలను మళ్లీ అదే వర్గాలకు కేటాయించడం ద్వారా వారి రాజకీయ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం కొనసాగించాలని ఆయన కోరారు. కూటమి పొత్తు కారణంగా కొంతమంది బీసీ నాయకులు తమ సీట్లను త్యాగం చేసిన విషయం తెలిసిందే అని పేర్కొన్నారు.రాష్ట్ర జనాభాలో బీసీ వర్గాలు అధిక శాతం ఉన్నప్పటికీ వారికి రాజకీయ అవకాశాలు తక్కువగా లభిస్తున్నాయని ఆయన అన్నారు. త్వరలో ఖాళీ కానున్న పిల్లి సుభాష్ చంద్ర బోస్ రాజ్యసభ స్థానాన్ని మళ్లీ బీసీ వర్గానికే కేటాయించాలని కూటమి ప్రభుత్వాన్ని బొక్కా ప్రసాద్ కోరారు. సామాజిక న్యాయం మరియు సమాన అవకాశాల కోసం ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని బీసీ వర్గాల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
