బడుగువానిలంకలో అయ్యప్ప స్వామి "ఆరాట్టు" వేడుకలకు సర్వసిద్ధం

 


కేరళ తరహలో భారీ ఏర్పాట్లు 

   అయ్యప్ప స్వామికి కేరళలో నిర్వహించే ఆరాట్టు కార్యక్రమం మాదిరిగానే గోదావరి జిల్లాల్లో తొలిసారిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గోదావరి చెంతన నిర్వహించనున్నారు.ఆరాట్టు అంటే స్వామి వారి విగ్రహాన్ని నదిలో శుద్ది చేసే మహిమానిత్వ కార్యక్రమం. అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి పంబలో ఈ ఆరాట్టు కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహిస్తాయి. అదే తరహాలో బడుగువానిలంక చెంత నున్న గౌతమి నదిలో ఈ ఆరాట్టు నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి కడియం కు చెందిన తాడాల వీర వెంకటరావు గురుస్వామి ఆధ్వర్యంలో విస్సు మాల ధరించిన అయ్యప్ప స్వామి భక్త బృందం ఈ ఆరాట్టు నిర్వహిస్తారు.108 కళాశాలతో గ్రామం నుండి ఊరేగింపుగా గోదావరి చెంతకు చేరుకుని ఈ కార్యక్రమాన్ని చేపడతారు.

     ఇప్పటివరకు రాష్ట్రంలో అయ్యప్ప స్వామి మండల దీక్షలు, జ్యోతి దర్శన దీక్షలు వంటివి మాత్రమే ఎక్కువగా అయ్యప్ప స్వాములు చేపడతారు. కాని ఈ ఆరాట్టు నిర్వహించడానికి విస్సు మాలాధారణ 30 మంది భక్తులు చేపట్టారు. బడుగువానిలంక గ్రామానికి చెందిన పడాల వెంకటేశ్వరరావు గురుస్వామి పర్యవేక్షణలో లంక గ్రామాల చెందిన భక్తులు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.భక్తులు విరాళంగా ఇచ్చిన లక్షలాది రూపాయల వ్యయంతో భారీ ఏర్పాట్లు చేశారు.ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం వేలాది మందికి అన్న సమారాధన నిర్వహిస్తారు. అలాగే బుధవారం రాత్రి అయ్యప్ప స్వామి ఉత్తరా నక్షత్ర జన్మదిన వేడుకలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అయిదు సంవత్సరం నుంచి ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. పాతూరు రామాలయం వద్ద అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, అనేక రకాల పండ్ల రసాలతో అభిషేకాలు జరుపుతారు. ఎంతో కన్నుల పండువగా జరిగే ఈ వేడుకలు తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు.