జగన్ హయాంలో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు...
కూటమి ప్రభుత్వ హయంలో ధాన్యం అమ్మిన కొన్ని గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు...ఆత్రేయపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు మరియు కలెక్టర్ మహేష్ కుమార్...రైతే రాజని,వ్యవసాయమే మన వెన్నుముకని, మన రాష్ట్రం వ్యవసాయాధారిత రాష్ట్రమని, వ్యవసాయమే మన బ్రతుకుతెరువని, మన రాష్ట్ర అభివృద్ధి వ్యవసాయం మీద ఆధారపడి ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆత్రేయపురంలో సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఆకుల రామకృష్ణ, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ, వాడపల్లి దేవస్థానం పాలకమండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు,పాలూరి సత్యానందం,సివిల్ సప్లై అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులతో కలిసి రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆత్రేయపురంలో ప్రారంభిస్తున్నామన్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో తేమశాతాన్ని పరీక్షించారు. కొనుగోలు విధానాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 23 లక్షల మెట్రిక్ తనుల ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. 5.40 కోట్ల గోతాలను సిద్ధం చేసిందన్నారు. ధాన్యాన్ని రవాణా చేసేందుకు 17,200 లారీలు సిద్ధం చేసిందన్నారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాకు రూ.2,389లు,సాధారణ రకం ధాన్యానికి రూ.2,369లు చెల్లిస్తుందన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ధాన్యం అమ్ముకుంటే డబ్బులు వస్తాయో, రావో, ఎప్పుడు వస్తాయో తెలియని దౌర్భాగ్య పరిస్థితి, బరకాలు లేని పరిస్థితి, గిట్టుబాటు ధరలు లేని పరిస్థితులు, ఈ కేవైసీ జరగని పరిస్థితులు అప్పుడు ఉండేవన్నారు. అటువంటి పరిస్థితులు సరిదిద్దుకుని నేడు ధాన్యం అమ్ముకున్న కొన్ని గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. రైతులు అమ్ముకున్న ధాన్యానికి ఆరు గంటల్లోనే డబ్బులు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానిదన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
