ఆత్రేయపురం మండలంలో రూ.2.85 కోట్లతో చేపట్టిన విద్యుత్ ఆధునీకరణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు...




ఆత్రేయపురం మండల ప్రజల దీర్ఘకాలిక విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది...

కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు....

ఆత్రేయపురం మండల వాసులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలకు నేటితో పరిష్కారం లభించిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఆత్రేయపురం మండలంలో పెరవరం ఎటిగట్టు మరియు సబ్ స్టేషన్ దగ్గర ఉన్న విద్యుత్ ఆధునీకరణ పనులను ప్రారంభించారు. మొదటగా బొమ్మూరు 220 కెవి సబ్ స్టేషన్ నుండి ఆత్రేయపురం మండలం పెరవరం గోదావరి నది మీదుగా వచ్చే పాత టవర్ లైన్స్ స్థానంలో రూ.50లక్షల  వ్యయంతో ఏర్పాటు చేసిన కొత్త పాంథర్ కండక్టర్ ను జిల్లా ఈపీడీసీఎల్ సూపరిండెంట్ రాజేశ్వరి దేవి, కన్స్ట్రక్షన్ డీఈ విజయానంద్, అమలాపురం డిఈ రాంబాబు తదితరులతో కలిసి ప్రారంభించారు. అనంతరం పెరవరం సబ్ స్టేషన్ వద్ద పులిదిండి, వద్దిపర్రు, వెలిచేరు గ్రామాలకు 24 గంటలు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయుటకు రూ.2.35కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 11కె.వి లైన్, ట్రాన్స్పార్మర్లు,11కె.వి బ్రేకర్ ను ప్రారంభించారు. రాబోయే నాలుగైదు ఏళ్లకు కూడా ఎటువంటి విద్యుత్ ఇబ్బందులు లేకుండా చేయాలన్న ఆలోచనతో పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో ఆర్డీఎస్ఎస్ పనులు చేపట్టి, పూర్తి చేసుకుంటున్నామన్నారు. ఆత్రేయపురం మండలానికి సంబంధించి బొమ్మూరు నుంచి వచ్చే వైరు పురాతనమైనది కావడంతో ఎన్నోసార్లు తెగిపోవడం జరిగేదన్నారు. గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ లైన్ తెగిపడితే మరమ్మత్తులు చేయడానికి రెండు నుంచి మూడు నెలల వరకు సమయం పట్టేదన్నారు. దీని వలన ఆత్రేయపురం మండల ప్రజలు, ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం వెంటనే స్పందించి గోదావరి మీదుగా ఉన్న పాత వైరు తొలగించి, దాని స్థానంలో శక్తివంతమైన పాంథర్ కండక్టర్ను అమర్చిందన్నారు.  ఆత్రేయపురం మండలానికి కొత్తపేట సబ్ స్టేషన్ నుంచి లైన్ రావడం చాలా దూరం అవుతుందని, అందుకే బొమ్మూరు నుంచి వచ్చే లైన్ ను ఆధునీకరించడంతో ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. ఆంధ్ర ప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రజల యొక్క మేలే  తమకు ముఖ్యమనుకుని, ప్రజలకు 24 గంటలు సరఫరా ఇవ్వాలనే లక్ష్యంతో రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా ఇవ్వాలని ఆర్డీఎస్ఎస్ అనే పథకంలో ప్రతి గ్రామంలో త్రీఫేస్, సింగల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లు,కొత్తగా లైన్లు వేయడం, పాత కరెంటు స్తంభాలు తీసి కొత్తవి వేయడం చేస్తుందన్నారు. అన్ని సరిదిద్దుకుంటూ రాబోయే నాలుగైదు ఏళ్లకు విద్యుత్ ఇబ్బందులు లేకుండా చేయాలని ఆలోచనతో పెద్ద ఎత్తున ఆర్డీఎస్ఎస్ పనులు చేసుకుంటున్నామన్నారు. ఎక్కడ ఏ విధమైన లో వోల్టేజ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసే సరిదిద్దుదామని ఎస్ ఈ  చెప్పారని ఎమ్మెల్యే అన్నారు.

ఆత్రేయపురం మండలంలో నేడు ప్రారంభించుకున్న పనులతో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. త్రీఫేస్ సరఫరా ఇక నిరంతరంగా వస్తుందన్నారు. ఎవరైనా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్న ఇబ్బందులు ఉండవన్నారు. లో వోల్టేజ్ సమస్య కూడా తీరిపోతుందన్నారు. వరదల సమయంలో కూడా విద్యుత్ సరఫరా అంతరాయం తగ్గి, అత్రేయపురం మండలానికి నిరంతర మరియు నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉంటుందన్నారు.కోనసీమ ప్రాంతంలో కరెంట్ లైన్లు ఎక్కువగా చెట్ల మధ్య నుంచి వెళ్తున్నాయని దీని వలన చెట్టు కొమ్మలు, ఆకులు లైన్లపై పడటం వల్ల తరచుగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందన్నారు.  ఈ సమస్యను పరిష్కరించడానికి సుమారు రూ.3.60 కోట్లతో ప్రస్తుతం 33/11కెవి బిళ్లకుర్రు సబ్ స్టేషన్ కు వెళ్లే సుమారు 8 కిలో మీటర్లు 33 కెవి మెయిన్ లైన్ను ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న కవర్డ్ కండక్టర్ తో మార్చడం జరిగిందన్నారు. ఈ కవర్డ్ కండక్టర్ వలన గాలి వీచినా, వర్షం పడినా, చెట్టు ఆకులు లేదా కొమ్మలు లైన్లపై పడినా కరెంట్ నిలిచిపోవడం దాదాపుగా ఉండదన్నారు.  దీంతో ప్రజలకు నిరంతర మరియు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందన్నారు. అలాగే ఎస్సీ, బీసీ,ఓసి వర్గాలన్నీ సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న సోలార్ రూఫ్ టాప్ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.