- ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు
- తక్షణమే విధులకు హాజరవుతామని ఉద్యోగుల హామీ
అమరావతి, ఫిబ్రవరి 24: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఉద్యోగుల ఆందోళనకు ముగింపు పలికింది. మంగళవారం వెలగపూడి సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ (ఎక్స్‌ఆఫీషియో), ఆర్ సీ ఎస్ ఆహ్మద్ బాబు, ఆప్కాబ్ ఎండీ రామకృష్ణలతో కలిసి నిర్వహించిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో విస్తృత చర్చలు జరిపి, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశాల ఫలితంగా 6 డిసెంబర్ 2025 నుంచి కొనసాగుతున్న పీఏసీఎస్ ఉద్యోగుల ఆందోళనకు తెరపడింది. ప్రభుత్వం ఉద్యోగుల జీతాలకు మొత్తం 20 శాతం పెంపును ఆమోదించగా, గ్రాట్యుటీని రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచింది. అలాగే ప్రతి ఉద్యోగికి రూ.5 లక్షల కవరేజీతో సమగ్ర గ్రూప్ మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. పీఏసీఎస్ ఉద్యోగులకు సంబంధించిన పై ప్రయోజనాల అమలు విధానాలను ఉన్నత స్థాయి కమిటీ అతి త్వరలో ప్రకటిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అదేవిధంగా పీఏసీఎస్ యూనియన్లకు సంబంధించిన ఇతర డిమాండ్లను కూడా కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసులు చేయనుందన్నారు. సహకార బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడంలో, రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి మద్దతు ఇవ్వడంలో పీఏసీఎస్ ఉద్యోగుల పాత్ర కీలకమని ప్రభుత్వం స్పష్టంగా గుర్తించిందన్నారు. పీఏసీఎస్ కంప్యూటరైజేషన్, ఈఆర్పి లో రియల్‌టైమ్ లావాదేవీలు, డైనమిక్ ఈఓడీ ప్రక్రియలు, హెచ్ఆర్ఎంఎస్ ద్వారా జీతాల చెల్లింపు వంటి కీలక బాధ్యతలను ఉద్యోగులు నిబద్ధతతో నిర్వహిస్తున్నారని మంత్రి అచ్చెన్న ప్రశంశించారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు
ఈ సందర్భంగా విజయవాడలోని క్యాంప్ ర్యాలీలో పీఏసీఎస్ ఉద్యోగులు మంత్రి అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలసి సత్కరించారు. ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ ఈ సానుకూల నిర్ణయాల వలన సహకార బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, ఉద్యోగులు మరింత ఉత్సాహంతో రైతులకు సేవలు అందిస్తారని సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ నిర్ణయాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్మిక హిత దృక్పథానికి, మంత్రి అచ్చెన్నాయుడు దూరదృష్టి నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్పప్పుడు హెచ్ ఆర్ పాలసీని ఆచరణలోకి తీసుకురావడం, నేడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జీతాలు పెంపు జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. తమ సమస్యలను సానుకూలంగా పరిష్కరించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, తక్షణమే ఆందోళన విరమించి సాధారణ విధులకు హాజరవుతామని ఉద్యోగులు స్పష్టం చేశారు.
