NH 216 E నిర్మాణంతో ప్రజల్లో భయాందోళనలు: ఎంపీ హరీష్‌కు పల్లంరాజు, గణేష్ వినతి
కొత్తగా ప్రతిపాదించిన జాతీయ రహదారి 216 E ( అమలాపురం - రావులపాలెం ) అలైన్‌మెంట్ విషయంలో కోనసీమ జిల్లా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ రహదారి నిర్మాణం వల్ల సారవంతమైన సాగు భూములు, జనవాసాలు,, కొబ్బరి తోటలు భారీగా దెబ్బతినే అవకాశం ఉందన్న భయంతో స్థానికులు ఉన్నారు.
ఈ నేపథ్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ లు అమలాపురం పార్లమెంట్ సభ్యుడు జి.ఎం. హరీష్ (బాలయోగి) ను కలిసి ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరారు.
అలైన్‌మెంట్ మార్పు చేయాలి : ప్రస్తుత ప్రతిపాదిత మార్గం వల్ల వందలాది ఎకరాల పచ్చని తోటలు, ఇళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని, ముఖ్యంగా ఇందుపల్లి లో చాలా ఇళ్ళు కోల్పోతున్నారని దీనిపై పునరాలోచన చేయాలని కోరారు.
క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులను తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, బాధితుల గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు విన్నవించారు.
నష్టపరిహారం & ప్రత్యామ్నాయాలు: ఒకవేళ రహదారి నిర్మాణం తప్పనిసరైతే, రైతులకు, నిరుపేదలకు గరిష్ట స్థాయిలో నష్టపరిహారం అందేలా చూడాలని, వీలైతే జనవాసాలకు దూరంగా ఖాళీ ప్రదేశాల గుండా అలైన్‌మెంట్ ఉండేలా మార్పులు చేయాలని సూచించారు.
ఎంపీ స్పందన:
ప్రజల నుంచి వస్తున్న అభ్యర్థనలను తాను ఇప్పటికే గమనిస్తున్నానని, ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ హరీష్ హామీ ఇచ్చారు. అభివృద్ధి జరగాలి కానీ అది ప్రజలకు కన్నీరు మిగల్చకూడదన్నదే తమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఎంపిని కలసిన వారిలో ఛాంబర్ అధ్యక్షులు బోనం సత్తిబాబు, కొమ్ముల సురేష్, మద్దాల రాజా తదితరులు వున్నారు.
