పేదల పట్ల దయార్ధహృదయం కలిగి ఉండాలి.... సహనం ఉపవాస దీక్ష నేర్పు గుణం..మండపేట లో రంజాన్ రెండో శుక్రవారం ప్రార్థనలు.....





 పేదల పట్ల దయార్ధహృదయం కలిగి ఉండాలని మండపేట 

హానఫీ అహలే సున్నత్ వల్ జామియా మస్జిద్ ఇమామ్ ముహమ్మద్ గులామ్ ముర్షీద్ రజ్వీ అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో రెండో శుక్రవారం ప్రార్థనలు మండపేట కలువ పువ్వు సెంటర్ లో ఉన్న ప్రసిద్ధ ప్రాచీన జామియా మస్జిద్ లో నిర్వహించారు. మండపేట పరిసర ప్రాంతాల నుండి ముస్లిం లు అధిక సంఖ్యలో తరలి వచ్చి జూమ్మ  ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మస్జిద్ ఇమామ్ ముహమ్మద్ గులామ్ ముర్షీద్ రజ్వీ ఆధ్యాత్మిక ప్రసంగం కుద్బా చేశారు. రంజాన్ 

నెల విశిష్టత తెలియజేశారు. సహనం ఉపవాస దీక్ష నేర్పు గుణం అన్నారు. ఆకలి దప్పికల తో ఉంటడం ఒక్కటే సత్కార్యం కాదని తోటి ప్రజల్లో నిరుపేదలను గుర్తించి వారికి అన్ని విధాలుగా సహాయం అందించాలని అదే సత్కార్యం లోకి వస్తుందన్నారు. మంచి ఆలోచనలు, క్రమశిక్షణ యుతమైన జీవన విధానం రంజాన్ మాసం ఉపవాసాలు నేర్పిస్తాయని చెప్పారు. 

 ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం లో ప్రతి ఒక్కరూ దానధర్మాలు చేయాలన్నారు. ఉపవాస దీక్షలు, తరావీహ్  దానధర్మాలకు (జకాత్) తప్పనిసరిగా ఆచరించాలని కోరారు.  ఇస్లాం మతం సోదరభావం పెంపొందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల రంజాన్‌లో ఖురాన్ అవతరించిందని పేర్కొన్నారు. ఈ నెల రోజుల పాటు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కఠోర ఉపవాసంతో ఆధ్యాత్మిక చింతనతో బాటు సమాజం లో ఉన్న అంతరాలను తగ్గించేలా కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.

 ఉదయం నుండి సాయంత్రం వరకు అన్నపానీయాలు మాని, ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ అందరికీ ఉపయోగం పడేలా జీవన సరళి రూపొందించుకోవాలని పేర్కొన్నారు.ఈ మాసంలోనే మహనీయ మహా ప్రవక్త మహమ్మద్‌ రసూల్  సల్లలాహు అలైహి వ సల్లెం వారికి దివ్య పవిత్ర ఖురాన్ గ్రంథం ప్రసాదించబడిందని పేర్కొన్నారు.  ఈ నెలలో ఖురాన్ పఠనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.పేదలకు సహాయం చేయడం, జకాత్ (దానం)  ఫిత్రా (పేదలకు రంజాన్ విరాళం) ఇవ్వడం ద్వారా అందరూ సంతోషంలో ముస్లిం లు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

ఆధ్యాత్మికత  ఐక్యత కు నిదర్శనమని చెప్పారు.

 మనస్సు, శరీరాన్ని చెడు నుండి దూరం పెట్టి అల్లాహ్ యందు భక్తిని ఏర్పరచుకోవాలని పేర్కొన్నారు. తోటి వారితో కలిసి ఇఫ్తార్ (ఉపవాస విరమణ) లో పాల్గొనడం వల్ల సామాజిక  సమరస్యత పెరుగుతుందన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఫాతిహా, దరుద్ సలాం కార్యక్రమం నిర్వహించారు. ఇదే రీతి లో మండపేట సైదులు పేట లోని హజరత్ హంజా మస్జిద్, గాంధీనగర్ లోని అల్ అమీనా మస్జిద్, విజయ లక్ష్మీ నగర్ లోని అక్సా మస్జిద్ లలో శుక్రవారం ప్రార్థనలు నిర్వహించారు.ఆయా మసీదు లలో ముస్లిం లకు అవసరమైన ఏర్పాట్లు ఆయా మసీదు బాధ్యులు ఏర్పాట్లు చేశారు.