రంజాన్ మాసం లో ముస్లిం లు ఆచరించే కఠోర ఉపవాసం సహనం శాంతి ఆత్మవిశ్వాసం లను పాఠం గా నేర్పుతుందని జామియా మస్జిద్ ఇమామ్ ముహమ్మద్ గులామ్ ముర్షీద్
రజ్వీ అన్నారు.మండపేట కలువపువ్వు సెంటర్ లోనీ ప్రాచీన జామియా మస్జిద్ లో రంజాన్ మాసంలో తొలి శుక్రవారం ప్రార్థనలు నిర్వహించారు. మండపేట పరిసర ప్రాంతాల ముస్లిం లు పెద్ద సంఖ్యలో మసీదు కు చేరుకున్నారు. స్థానికులు తో బాటు బీహార్, బెంగాల్, ఒరిస్సా లా నుండి ఇక్కడికి వలస వచ్చిన కార్మికులు మస్జిద్ లో ప్రార్థనలు చేశారు. మసీదు ప్రాంగణం, పై అంతస్తు పూర్తిగా నిండిపోయాయి. ఈ సందర్భంగా మస్జిద్ ఇమామ్ ముహమ్మద్ గులామ్ ముర్షీద్ రజ్వీ ఆధ్యాత్మిక ప్రసంగం కుద్బా చేశారు. మానవాళి కి మార్గదర్శనం చూపే పవిత్ర ఖురాన్ గ్రంథం ఈ నెల లో భూపిపైకి అవతరించిందని పేర్కొన్నారు. మహనీయ మహా ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా రసూలుల్లాహ్ సల్లే లాహు వలేహి అస్సలాం వారు రంజాన్ మాసం విశిష్టత ను ఎంతగానో వివరించేవారన్నారు. ఆకలి తో బాటు జీవన సరళి, మంచి అలవాట్లు, ఆరోగ్య ప్రయోజనాలు రంజాన్ ఉపవాస దీక్ష లో ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరు దానం గుణం కలిగి ఉండాలని ఈ మాసం దిశా నిర్దేశం చేస్తుందన్నారు. ఉపవాస విరమణ సమయం లో చేసే ప్రార్థనలు అల్లాహ్ వద్ద అంగీకరింపబడ్తాయని పేర్కొన్నారు. ఉదయం తెల్లవారు జామున నుండి సూర్య అస్తమయం వరకు దీక్ష చేసే వారు జీవితంలో ఎలా జీవించాలో నేర్చుకుంటారని పేర్కొన్నారు. ఇస్లాం దయ, శాంతి, కరుణ కోరుకునే మతమన్నారు. సమస్త మానవాళి కి శుభాలు చేకూర్చే ఈ నెల విశిష్టత ఆయన తెలియజేశారు. ప్రార్థనల అనంతరం మసీదు ఆవరణ లో ఉన్న ఖబరస్తాన్ లో తమ పూర్వీకుల సమాధులు వద్ద శాంతి ప్రార్థనలు చేశారు. మండపేట సైదులు పేట లోని హజరత్ హంజా మస్జిద్, గాంధీనగర్ లోని అల్ అమీనా మస్జిద్, విజయ లక్ష్మీ నగర్ లోని అక్సా మస్జిద్ లలో పెద్ద ఎత్తున తొలి శుక్రవారం ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు.ఆయా మసీదు బాధ్యులు ఏర్పాట్లు చేశారు.
