నియోజకవర్గాన్ని తూర్పులో విలీనం చేయడం పట్ల కృతజ్ఞతలు అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే వేగుళ్ళ...

మండపేట నియోజకవర్గంలోని మండపేట రాయవరం కపిలేశ్వరపురంలో ఇండోర్ ఔట్ డోర్  స్టేడియంలను ఏర్పాటు చేసి క్రీడాభివృద్ధి చేయాలని మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన బుధవారం మాట్లాడారు.తన గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మూడు లక్షల జనాభా తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసినందుకు నియోజవర్గం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళ సోదరీమణులు ఈ తరమే కాకుండా తరతరాలుగా దూరం వెళ్లకుండా అతి దగ్గరలో రాజమహేంద్రవరం కేంద్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయడంతో ముఖ్యమంత్రికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని ఇదే విషయాన్ని ప్రస్తావించాలని మహిళలు కోరారని పేర్కొన్నారు. మండపేట నియోజవర్గంలో మూడు లక్షల జనాభా ఉన్నప్పటికీ విద్యార్థులు యువత, విద్యార్థులు, క్రీడాకారులు చిన్నారులు ఆడుకోవడానికి ఎటువంటి క్రీడా మైదానాలు లేవని పేర్కొన్నారు. స్టేడియం ఒకటి కూడా లేదని పేర్కొన్నారు. గతంలో టిడిపి అధికారంలో ఉండగా మండపేట పట్టణంలో ఏడిద రోడ్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో స్టేడియం నిర్మాణానికి రెండు కోట్లు మంజూరు చేశారన్నారు. టెండర్లు పిలిచి పనులు కూడా ఆరంభించారన్నారు.2019లో అధికారం లోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని తుంగలో తొక్కిందని విమర్శించారు. ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం  రూ 30 లక్షలతో టెండర్ పిలిచినట్లు తెలిసిందన్నారు. కాగా ఈ రూ 30 లక్షలు సరిపోవన్నారు. సుమారు  మూడు నాలుగు కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. దీంతో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ప్రభుత్వానికి తమరు రుణం ఇవ్వండి అంటూ చలోక్తి విసిరారు. దీంతో సభలో నవ్వులు విరిసాయి. మండపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో పది ఎకరాల విస్తరణ ఉంటుందని అక్కడ ఇండోర్ ఔట్ డోర్ స్టేడియంలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. మండపేట మున్సిపాలిటీకి విశేష చరిత్ర ఉందని మున్సిపాలిటీగా 1959 లోనే ఏర్పాటు అయిందని వెల్లడించారు. రాయవరం మండలం కేంద్రంలో ఆరు ఎకరాల 98 సెంట్లు హైస్కూల్ ఉందని అక్కడ కూడా ఇన్ డోర్, ఔట్ డోర్ స్టేడియం లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే కపిలేశ్వరపురం హైస్కూల్ లో కూడా ఇండోర్, ఔట్ డోర్ క్రీడా స్టేడియం లు నిర్మించాలని కోరారు. మండపేట పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం ఎదురుగా పట్టణానికి నడిబొడ్డులో ఒక స్థలం ఉందని అక్కడ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్య ఇస్తున్న క్రమంలో మండపేట నియోజవర్గంలో స్టేడియంలో నిర్మించాలని ఆయన కోరారు.