– శాశ్వత అన్నదాన భవనానికి రూ.1.20 కోట్లు...కొత్తపేట నియోజకవర్గంలోని ప్రసిద్ధి చెందిన మందపల్లి శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామి ఆలయ అభివృద్ధికి పుష్కర నిధుల నుంచి భారీ మొత్తంలో నిధులు మంజూరయ్యాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు.ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న నూతన శాశ్వత అన్నదాన భవనానికి సుమారు రూ.1 కోటి 20 లక్షలు పుష్కర నిధుల నుంచి మంజూరయ్యాయని,త్వరలోనే టెండర్లను పిలిచి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.అలాగే గతంలో కూడా మందేశ్వర స్వామి ఆలయానికి పుష్కర నిధుల నుంచి శాశ్వత తైలాభిషేక భవన నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరయ్యాయని ఈ భవనానికి ఈనెల 10వ తేదీన శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆలయ అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు కేటాయించి సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృతజ్ఞతలు తెలిపారు.
