ప్రశ్నించే వార్త రాస్తే దాడి..? భజన చేస్తే జర్నలిస్టు..? – నిజం చెప్పిన రిపోర్టర్‌పై దాడి


మంచిర్యాల జిల్లా కన్నెపెల్లి మండల కేంద్రంలో జర్నలిస్టుపై జరిగిన దాడి ఇప్పుడు పలు ప్రశ్నలకు దారి తీస్తోంది. ఈ నెల 5వ తేదీన మండల కేంద్రంలోని కేజీబీవి విద్యాలయంలో నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడలో నాణ్యతా లోపాలు ఉన్నాయని వార్త ప్రచురించినందుకు రిపోర్టర్ చండే చంద్రశేఖర్ పై సంబంధిత కాంట్రాక్టర్‌తో పాటు స్థానిక అధికార పార్టీ నాయకులు దూసుకువచ్చి దాడికి దిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రజల పన్నుల డబ్బుతో నిర్మాణాలు జరుగుతున్నప్పుడు వాటిలో లోపాలను బయటపెట్టడం మీడియా బాధ్యత కాదా? లోపాలను ప్రశ్నించినందుకు జర్నలిస్టుపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు కాదా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

బాధితుడి వాంగ్మూలం ప్రకారం, “ఇలాంటి వార్తలు రాస్తే తోలు తీస్తాం… నీకేం సంబంధం… అధికారులు చూసుకోరా?” అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులను బెదిరించడం వెనుక ఎవరి ధైర్యం ఉంది? స్థానిక అధికారుల పాత్ర ఏమిటి? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

జర్నలిస్టులు ప్రజల కళ్లుగా పనిచేస్తారు.