ప్రజలకు కుచ్చు టోపీ పెట్టీ భగవంతునికి సేవా చేస్తాడా...
మోసగాడు గుప్తా ను పదవి నుండి దింపాలి ...
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ను విమర్శించే స్థాయి లేదు...
మండపేట లో చిట్టిల పేరుతో మధ్యతరగతి ప్రజలకు రూ 8 కోట్లు ఎగొట్టిన ఘనుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వాకచర్ల గుప్తా అని చిట్ ఫండ్ బాధితులు గ్రంధి సూరి పండు, బోడ నారాయణరావు, చెక్కా సురేష్, పసుమర్తి సూర్యనారాయణ, మద్దుల ఆనంద్ లు విమర్శించారు. మండపేట విజయలక్ష్మి నగర్ లోని వైసిపి కార్యాలయం లో మంగళ వారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మండపేట లో భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఛైర్మెన్ పదవికి వాకచర్ల గుప్తా అనర్హుడనీ దుయ్యబట్టారు.ప్రజలకు కుచ్చు టోపీ పెట్టీ భగవంతునికి సేవా చేస్తాడా అంటూ ప్రశ్నించారు. పేదల కడుపు కొట్టిన
మోసగాడు గుప్తా ను తక్షణమే ఛైర్మెన్ పదవి నుండి దింపాలనీ డిమాండ్ చేశారు. నిరంతరం బడుగు వర్గాల సంక్షేమం కోసం కృషి చేసే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ను విమర్శించే స్థాయి గుప్తా కు లేదన్నారు. ఆర్థిక నేరగాడు అయిన ఇతనికి చైర్మన్ పదవి ఎలా ఇచ్చారనీ ప్రశ్నించారు. గుప్త చిట్స్ అండ్ ఫైనాన్స్ పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడి దాదాపు 80 మంది బాధితులను మోసం చేశారన్నారు. రూ 8 కోట్ల రూపాయలు దిగమింగిన వాకచర్ల వీరవెంకట సత్యనారాయణ (గుప్తా) కు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును విమర్శించే హక్కు లేదని బాధితులు తీవ్రంగా ఖండించారు. తోట పై కేసు ఉన్నాయని విమర్శించారాని ఆ కేసు లు తరవాత జరిగిన ఎన్నికల్లో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు.ఆయనకు ప్రజల్లో ఉన్న మంచి పేరును ఓర్వలేకే ఇటువంటి విమర్శలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై 23 స్టే ఆర్డర్లు ఉన్న విషయాన్ని గుర్తెరిగి మాట్లాడాలన్నారు. సొంత బావమరిది ద్వారా ఖాతాదారులకు నోటీసులు ఇప్పించి, చిట్స్ పేరుతో సున్నం కొట్టించి, బావమరిదిని పోరంకి లో దాచిన ఘనత గుప్తాదే అన్నారు. తాము అతనిని వెతికి పట్టుకుని పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు చెప్పారు. తర్వాత ఇప్పనపాడు రూరల్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించామని వెల్లడించారు.మండపేటలో ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్‌గా ప్రమాణం చేయక ముందే గుప్తా పై ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందన్నారు. కేసులో నిందితుడిని ప్రమాణస్వీకారం ఎలా చేయించారో చెప్పాలన్నారు. దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారం ఎఫ్‌ఐఆర్ ఉన్న వ్యక్తికి పోలీసులు ఎలా క్లియరెన్స్ ఇచ్చారో చెప్పాలన్నారు. ఎండోమెంట్స్ ఉన్నతాధికారులు ఎలా నియమించారని ప్రశ్నించారు. ఆర్థిక లావాదేవీలపై ఉన్నత న్యాయస్థానంలో ఇప్పటికీ కేసు నడుస్తోందన్నారు. 80 మంది బాధితులు మోసం చేసి కోట్ల రూపాయలు ఎగొట్టిన ఆర్థిక నేరస్తుడు స్థాయి మరచిపోయి ఇతరులను విమర్శించడం చూస్తే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారం నిష్కళంకులు మాత్రమే ధర్మకర్తలుగా అర్హులని పేర్కొన్నారు. చిన్న మచ్చ ఉన్నవారు అనర్హులని చెప్పారు. నీతి-నిజాయితీ ఉంటే వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్‌గా తక్షణం రాజీనామా చేయాలని భాదితులు డిమాండ్ చేశారు. పట్టణ ప్రజలు, కలియుగ వెంకటేశ్వర స్వామిని ఆరాధించే భక్తులు, ఎండోమెంట్స్ అధికారులు హుండీ లెక్కింపు సమయంలో ఇటువంటి వ్యక్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. దేవుడి సొమ్ములు కూడా కొట్టేస్తారనీ చెప్పారు. దేవాలయ ప్రతిష్టను కాపాడాలని కోరారు. గుప్తా నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని, పంది పురాణాలు చదివినట్టు ఉందన్నారు. దేవాదాయ ధర్మాదాయకు సంబంధించిన కనీస పరిజ్ఞానం లేకుండా ఆలయ చైర్మన్‌గా నియమించడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్, పోలీసు డిపార్ట్‌మెంట్ ఎలా క్లియరెన్స్ ఇచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని బాధితులు డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.
