TELANGANA: ఎన్నికల వేళ ఒక పార్టీ టికెట్ మీద గెలిచి.. మరో పార్టీలోకి వెళ్లే ప్రజాప్రతినిధుల గురించి తెలిసిందే. ఇలాంటివి ఇప్పటికే బోలెడ్నెన్నిసార్లు తెర మీదకు వచ్చాయి. రేవంత్ సర్కారు మీద కంప్లైంట్ చేసిన బీఆర్ఎస్ అధికారంలో ఉన్న వేళలోనూ ఇతర పార్టీల నుంచి ఎన్నికైన వారిని తమ పార్టీలో చేర్చుకోవటం.. మంత్రి పదవులు ఇవ్వటం లాంటివి తెలిసిందే. అయితే.. అధికారంలో ఉన్నప్పుడు తాము చేసేవన్నీ రైటే అనుకునే రాజకీయ పార్టీలు.. తమ చేతికి అధికారం వచ్చిన సందర్భంలో మాత్రం ఆపరేషన్ ఆకర్ష్ ను చేపట్టటం తెలిసిందే. తెలంగాణలో రేవంత సర్కారు కొలువు తీరిన తర్వాత బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకోవటం తెలిసిందే. వీరందరికి మించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ టికెట్ మీద సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయటం తెలిసిందే.
తమ పార్టీ గుర్తుపై గెలిచిన వారు పక్క పార్టీలోకి వెళ్లాంటూ కంప్లైంట్ చేయటంతో పాటు.. సుప్రీంలో కూడా సవాలు చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ అంశంపై ఇటీవల న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ స్పందించారు. తాజాగా ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ ఫిర్యాదు నేపథ్యంలో తన ఎదుట హాజరై.. వివరణ ఇవ్వాల్సిందిగా ఐదుగురు ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో.. కాస్త ఆలస్యమైనా చర్యలు షురూ అయినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. నోటీసులతో ముగిస్తారా? లేదంటే చర్యలు ఉపక్రమిస్తారా? అన్నది ప్రశ్నగామారింది. సుప్రీంకోర్టు ఆదేశాల్ని గమనిస్తే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైవేటు వేసే విషయంలో బలంగా ఉండాలని రాష్ట్రాల స్పీకర్లను సుప్రీం కోరింది. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించిన స్పీకర్.. చివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్న ఎమ్మెల్యేల్లో..
1. దానం నాగేందర్
2. కడియం శ్రీహరి
3. పోచారం శ్రీనివాసరెడ్డి
4. అరికెపూడి గాంధీ
5. తెల్లం వెంకట్రావులు
గా చెబుతున్నారు. వీరితో పాటు సంజయ్ కుమార్.. కాలె యాదయ్య.. ప్రకాశ్ గౌడ్.. క్రిష్ణమోహన్ రెడ్డి.. మహిపాల్ రెడ్డిలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవటంలో ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలతో సుప్రీంకోర్టు తీర్పునేపథ్యంలో నోటీసులు జారీ చేసే ప్రక్రియ షురూ కావటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్ కు మూడు నెలల గడువు ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయనిపుణులతో చర్చించిన స్పీకర్.. నోటీసులు ఇవ్వటం సరైన చర్యగా నిర్నయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విచారణ మందుకు వెళ్లి.. చర్యలు ఖాయమైన నేపథ్యంలో తెలంగాణలో ఉప పోరుకు తెర తీసినట్లు అవుతుందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప పోరుకు యాభై శాతం కంటే ఎక్కవ అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
అయితే.. ఉప పోరు దిశగా అడుగులు పడితే.. రేవంత్ సర్కారుకు ఇదో పెద్ద ఇష్యూలా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుప్రీం గడువును నిర్దారించిన నేపథ్యంలో అసలేం జరగటం లేదనే దాని కన్నా.. ఏదో ఒకటి జరగుతుందన్న భావన చాలా ముఖ్యమని.. ఇప్పుడు ఆ దిశగానే అడుగులు పడుతున్నాయని చెబుతున్నారు. ఒకవేళ సుప్రీం నిర్దేశించిన గడువు లోపే పది మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తే మాత్రం ఉప పోరు ఖాయమని చెప్పక తప్పదు. మొత్తంగా చూస్తే.. తెలంగాణలో ఉప పోరు ఉండాలా? ఉండొద్దా? అన్నది స్పీకర్ చేతిలోనే ఉందని చెప్పక తప్పదు.