
సినిమా కష్టాలన్నీ పడ్డాడు
*నాలుగేళ్లు తిండికి కరువయ్యాడు*
*ఫైట్ మాస్టర్ "రామ్ సుంకర" సక్సెస్ స్టోరీ*
చిన్నప్పుడు సినిమాల్లోకి వెళ్లిపోవాలనే సరదా చాలామందికి ఉంటుంది. అందులోనూ గోదావరి జిల్లాల వారికి మరీను. అప్పుడు అంతగా చదువు అబ్బని రోజులు. ఏదో వీధి బడిలో చదువుకు మమా అనిపించేసి తల్లిదండ్రులు ద్వారా వచ్చిన వ్యవసాయ పనులు లేదా ఇటుక బట్టీలలోకి వెళ్లిపోవడం ఆ ఊర్లో జరుగుతూ ఉండేది.ఇటుక బట్టీలకు ప్రసిద్ధి చెందిన ఆ ఊరు ఎందరికో ఉపాధి ఇస్తుంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామానికి చెందిన సుంకర రాంబాబు (రామ్ సుంకర) కూడా బడికి వెళ్లడానికి పేచీ పెట్టేవాడు. ఆ ఊర్లో మూడో తరగతి వరకు చదివి ఆ పక్కన ఉన్న కడియం మండలం దుళ్లలో అయిదు వరకూ చదివాడు. చదువు రాకపోయినా కాని డిష్యూం..డిష్యూం.. అంటూ కరాటే కుంగ్ ఫూ మీద ఆసక్తి చూపేవాడు. అలాగని గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చే వాళ్ళు దొరికేవారు కాదు. అయినప్పటికీ తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కోన్నాళ్ల తర్వాత రాజమండ్రి పేపర్ మిల్లులో డైలీ కార్మికుడిగా చేరాడు. అప్పుడు అవకాశం దొరికింది... అక్కడ వలీ అనే కుంగ్ ఫూ మాస్టర్ దగ్గర చేరి వీలు దొరికినప్పుడల్లా కసరత్తులు చేసేవారు. కుంగ్ ఫూ కరాటే లో ఓ స్థాయికి వెళ్ళిపోయారు.చెముడులంక హై స్కూల్ గ్రౌండ్,బడుగువానిలంక గోదావరి ఇసుక తిప్పలు ఇతని కసరత్తులకు ఎన్నుకున్న ప్రదేశాలు.ఆ కుర్రాడు గాల్లో ఎగిరి ఫైటింగ్ లను నేర్చుకుంటుంటే కొందరు నవ్వుకునేవారు... మరికొందరు జాలిపడేవారు...ఇంకొందరు ఏదో సాధించేలా ఉన్నాడే అనుకునేవారు.ఎక్కడ కుంగ్ ఫూ,కరాటే పోటీలు జరిగినా బహుమతి తెచ్చేసేవాడు.కాని ఆ కుర్రాడు లక్ష్యం బహుమతులు కాదు.సినిమాల్లోకి వెళ్ళాలి... ఏదో సాధించాలనే తపన.
*నాలుగేళ్లు తిండికి కరువైంది...*
ఒకరోజు రాజమండ్రిలో రైలెక్కి జనరల్ బోగిలో హైదరాబాదు వెళ్లిపోయాడు. అక్కడ తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఏదో రకంగా స్టంట్ మాస్టర్ దగ్గర చేరాలనే తపనతో మొత్తానికి ఒకరి అడ్రస్ తెలుసుకుని ఆయన దగ్గరికి చేరుకున్నాడు. కత్తిలా ఉన్న ఈ కుర్రోన్ని ఆయన గారు బాగానే వాడుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తే పెద్దోడు అయిపోతాడనే ఉద్దేశంతో అలాగే ఇతని తొక్కి పెట్టి ఉంచాడు. ఆ రోజుల్లో స్టంట్ మెన్‌గా సభ్యత్వం తీసుకుంటే రోజుకు రూ.రెండు వేలు ఇచ్చేవారు. కాని అలాంటి అవకాశం లేకుండా కేవలం రోజుకు రూ.150 ఇస్తూ వాడుకున్నాడు.ఇలా నాలుగేళ్లు గడిచిపోయాయి. అంతా అయోమయం. తినడానికి కూడాలేని పరిస్థితి.అలాగని ఇంటికి వెళ్లే టైపు కాదు.ఏదో రకంగా సినిమాలో తన సత్తా చాటాలనే పట్టుదల బలంగా ఉంది.అవకాశాలు దక్కడం లేదని ఇంటికి వెళ్లిపోతే అవమానం.బంధువులు అధికంగా ఉన్న కుటుంబం. ఆ వూర్లో సుంకరోళ్లు అంటే ఓ బ్రాండ్ లా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు అనుకోకుండా తనదైంది. 20 మంది స్టంట్ మెన్లు ఉండగా వారందరిలో ఈ కుర్రోడు గాల్లో ఎగిరి ఫైటింగ్ చేస్తుంటే ఒకరి దృష్టిలో పడ్డాడు.వెంటనే భుజంపై చేయి వేసి ముందుగా సభ్యత్వం ఇప్పించారు.
*స్టంట్ మాన్ గా 457 సినిమాలు*

స్టంట్ మాస్టర్ గా గుర్తింపు*
టాలెంట్ ఉన్నోడికి అవకాశాలు దొరికితే ఏ విధంగా రాణించవచ్చో చూపించాడు ఈ రాంబాబు. కాదు.. కాదు.. "రామ్ సుంకర". సినిమాల్లో గుర్తింపు వస్తే పేర్లు కూడా మారుతాయని మీకు వేరే చెప్పనవసరం లేదు. ఇతని విషయంలో కూడా అదే జరిగింది. రామ్ సుంకర్ గా ఇప్పటి వరకు 226 తెలుగు, తమిళం, కన్నడం, ఒడిశా,హిందీ,బెంగాలీ తదితర భాషల్లో సినిమాలకు ఫైట్ మాస్టర్ గా పనిచేశారు. అందులో అగ్ర హీరోలను, దర్శక, నిర్మాతలను ఆకట్టుకున్నారు. ఫైటింగ్ కంపోజ్ చేయడంలో ఓ బ్రాండ్ గా మారిపోయాడు. సినిమా వేడుకల్లో రామ్ సుంకర గురించి ప్రత్యేకంగా అభినందించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా 2011లో మంచు మనోజ్ ఇతనికి ఫైల్ మాస్టర్ గా అవకాశం ఇచ్చారు."నేను మీకు తెలుసా" సినిమాలో ఇతన టాలెంట్ చూసి మనోజ్ ఇతన్ని వ్యక్తిగత ఫైట్ మాస్టర్ గా కొంతకాలం పెట్టుకున్నాడు. ఆ సమయంలోనే బాలకృష్ణ, మనోజ్ లు నటించిన "ఊ కొడతారా..ఉలిక్కి పడతారా.." సినిమా ఈయనకు మంచి గుర్తింపునిచ్చింది. ఈయనకు ఫైట్ మాస్టర్ మాస్టర్ గా రౌడీ, కరెంటు తీగ, పేపర్ బాయ్, పోటుగాడు, దొంగాట, అర్జున్ రెడ్డి, పలాస వంటి అనేక సినిమాలు గుర్తింపు తెచ్చాయి.
*టాలెంట్ ఉంటే సినిమాల్లో రాణిస్తారు..*
టాలెంట్ ఉన్నవాళ్లు సినిమాలలో రాణిస్తారని అయితే వారికి ఎవరో ఒకరు తోడ్పాటు తప్పనిసరని, ఎవరి సహకారం లేకుండా సినిమా రంగంలోకి వెళ్లాలనుకునే వారెందరో మోసపోయిన సంఘటన చాలా ఉన్నాయని రామ్ సంకర తెలిపారు. శుక్రవారం చొప్పెల్ల తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడుతూ సినిమాల్లో అవకాశాల కోసం చాలామంది వచ్చి ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తాను పడిన కష్టం ఎవరూ పడకూడదని తన వద్దకు వచ్చిన సుమారు 40 మందికి వివిధ కేటగిరిలలో అవకాశాలు కల్పించినట్లు ఆయన వివరించారు. అలాగే తన సోదరుడు అభిలేష్ సుంకర కూడా మార్షల్ ఆర్ట్స్ లో విశేష ప్రతిభ సాధించడంతో అనేక సినిమాల్లో స్టంట్ మెన్ గా, ఫైట్ మాస్టర్ గా పనిచేశారన్నారు. అలాగే సుంకర బ్రదర్స్ బ్యానర్ పై సినిమాలు కూడా తీస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దమ్కీ, పగ.. పగ..పగ.. సినిమాలు చిత్రీకరించి విడుదల చేశామన్నారు.గురువారం నుంచి ఆహ లో కూడా వస్తున్నట్లు వివరించారు.