ఆత్రేయపురం:
అక్టోబర్ 10వ తేదీ నుంచి జరగనున్న కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు. ఆదివారం వాడపల్లి విచ్చేసిన ఆయన దేవస్థానం నూతన చైర్మన్ గా ఎంపికైన ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు లతో కలిసి నిర్మాణంలో ఉన్న వకుళ మాత అన్నదాన భవన కేంద్రాన్ని, కోనేరు అభివృద్ధి పనులను పరిశీలించారు. గోదావరి గట్టు వద్ద టూరిజం అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలను పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఈపీఎఫ్, 20 లక్షల రూపాయల భీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రకటించారు. ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ కి ఉద్యోగుల జీతం నుండి 13 శాతం తీసుకుంటారని, 12 శాతం దేవస్థానం భరిస్తుందని తెలిపారు.అలాగే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు 20 లక్షల ఆరోగ్య బీమా కూడా వర్తిస్తుందని ఆయన అన్నారు. ప్రతి శనివారం వేలాదిగా తరలివస్తున్న భక్తులకు సేవలు అందిస్తున్న ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం శతవిధాలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ,ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కోనసీమ తిరుమల వాడపల్లి దేవస్థాన అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఎమ్మెల్యే బండారు కృషితో తమ జీవితాల్లో వెలుగులు నింపారని ఉద్యోగులు ఆనందం వ్యక్తంచేశారు. ఉద్యోగులంతా ఎమ్మెల్యే బండారు,నూతన ఛైర్మెన్ ముదునూరి వెంకటరాజు,ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరావులను గజమాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే బండారు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం పండితులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ముదునూరి రామభద్రిరాజు,కొప్పిశెట్టి ప్రసాద్,ఎపుగంటి వెంకటేశ్వరరావు, ఎరుబండి రాజు పాల్గొన్నారు.