వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తే ఊరుకోం.
వాడపల్లి దేవాలయ అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగ్గిరెడ్డి విమర్శలు.
దేవాలయాన్ని అప్రతిష్టపాలు చేయడం కాదు, నేరుగా నన్నే ఎదుర్కొండి.
కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.
కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి వస్తున్న ఆదరణ, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక, మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వ్యక్తిగత కారణాలతో దేవాలయ ప్రతిష్ట దిగజారేలా లేనిపోని ఆరోపణలు చేయడం బాధాకరమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన వాడపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు.మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి బుద్ధి, జ్ఞానం ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నానన్నారు.ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మూడు సార్లు ఎమ్మెల్యే గా పనిచేసిన వ్యక్తి ఇంగిత జ్ఞానం లేకుండా, ఆలయ ప్రతిష్ఠను పట్టించుకోకుండా వ్యవహరిస్తుంటే బాధేస్తుందన్నారు.అంతలా దిగజారి తాము మాట్లాడలేమన్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి నోటికి వచ్చినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు.ఆయన ఆరోపణలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయ అభివృద్ధికి చేపట్టిన పనులను వివరించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక రూ.43 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 4 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను పూర్తిచేశామన్నారు.14 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నట్లు తెలిపారు. మరో 26 కోట్ల రూపాయల పనులు త్వరలో మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిధులు మంజూరై టెండర్లు పూర్తవడంతో సదరు పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. వైసిపి ఐదేళ్ల కాలంలో 14 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 17 నెలల కాలంలోనే సుమారు రూ.43 కోట్ల పనులను చేపట్టామన్నారు. ఈ విధంగా కోనసీమ తిరుమల వాడపల్లిని అభివృద్ధి చేస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నారని, మాజీ ఎమ్మెల్యే ఎందుకు ఇబ్బంది పడుతున్నారో అర్థం కావటం లేదన్నారు.ప్రస్తుతం 54 రూములు నిర్మాణంలో ఉన్నాయన్నారు.గత ఐదేళ్లు రూములు కట్టకుండా గుడ్డి గుర్రం పళ్ళు తోమేరా? అని ప్రశ్నించారు. నాలుగు డార్మెటరీల నిర్మాణం చేపట్టామన్నారు. రూ.12కోట్లు మంజూరు అయ్యాయన్నారు. త్వరలోనే మంత్రి ఆనం చేతుల మీదుగా శంకుస్థాపన చేసి వాటి నిర్మాణం మొదలు పెడతామన్నారు.ఒక ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ఆఫీసర్ కానీ వస్తే కూర్చోవడానికి ఒక్క రూము కూడా నిర్మించకుండా గత వైసిపి ప్రభుత్వంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదన్నారు. చైర్మన్ రూమును తన సొంత డబ్బులతో అందంగా తీర్చిదిద్ది దేవాలయానికి ఇవ్వాలి అని ఛైర్మన్ ముదునూరి అనుకుంటే దాని మీద కూడా విమర్శలు చేయడం సరికాదన్నారు. వాడపల్లి దేవాలయం అభివృద్ధి చెందటం మీకు ఇష్టం లేదా?అని ప్రశ్నించారు. గతంలో ఇక్కడ ఒక్క టాయిలెట్ నిర్మాణం కూడా చేయలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 140 టాయిలెట్స్ కట్టామని చెప్పారు. ప్రసాదాల నాణ్యత పెంచామన్నారు. నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామన్నారు. భక్తుల రద్దీ నియంత్రణలో ఉండేలా ద్వారాలు వెడల్పు చేసి అయిదారు గంటలు పట్టే దర్శనాన్ని భక్తులకు ఇబ్బంది లేకుండా చేసామన్నారు. పచ్చకామెర్లు వాడికి అంతా పచ్చగా కనపడినట్లుగా అవినీతితో నిండిపోయిన మీకు అందరు అవినీతిపరులుగా కనపడుతున్నారా? అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే పూర్తిగా అవినీతిలో మునిగిపోయిన విషయం రాష్ట్రం అంతా తెలుసన్నారు. మీరు దోపిడీదారుడు అయితే అందరూ దోపిడీదారులు అవుతారా? అని ప్రశ్నించారు. హుండీ లెక్కింపు కు వచ్చిన వ్యక్తి 52,000 దొంగతనం చేశారని తెలియగానే అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయించామన్నారు. అతడు 17 రోజులు జైల్లో గడిపాడని తెలిపారు. డూప్లికేట్ టికెట్లు తీసి మోసానికి పాల్పడిన ఉద్యోగిపై వెంటనే చర్య తీసుకున్నామన్నారు. తప్పు చేసిన వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో ఎవ్వరి మీదనైనా ఒక్క ఎఫ్ఐఆర్ అయినా ఫైల్ చేశారా? అని ప్రశ్నించారు. వైసిపి హయాంలో ఎన్నో తప్పులు జరిగాయని, నలుగురు ఉద్యోగులు తప్పు చేస్తూ దొరికితే, నాలుగు నెలలు మానిపించి తిరిగి ఉద్యోగం లోకి తీసుకున్నారన్నారు. బొబ్బర్లంకకు చెందిన వ్యక్తి స్కామ్ చేస్తే అతనిపై కనీసం కేసు కూడా నమోదు చేయలేదని, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని విమర్శించారు. ప్రతి వ్యవస్థలోనూ లోపాలు జరుగుతాయని,అయితే చక్కదిద్దాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎన్డీఏ కూటమినేతలు దోపిడీ చేస్తున్నారని, పునరావాస కేంద్రంగా వాడపల్లిని మార్చారని మాట్లాడడం సరికాదన్నారు.గత వైసిపి హయాంలో చైర్మన్ కుర్చీలో ఎవరు కూర్చుని ఇక్కడ అధారిటీ చేసేవారు అందరికీ తెలుసన్నారు.దేవస్థానంలో ఎవరైనా ఉద్యోగి తప్పు చేస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుని సరిదిద్దుతామని, గత మీ ప్రభుత్వ హయాంలో కప్పి పుచ్చినట్లుగా చెయ్యమన్నారు. జరిగిన పొరపాట్లను భూతద్దంలో చూపటం, విమర్శించడం సరికాదన్నారు. దేవాలయం అభివృద్ధి చెందడం ఓర్చుకోలేకపోతున్నారా? లేక బండారు సత్యానందరావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దేవాలయాన్ని బాధ్యతగా తీసుకొని అభివృద్ధి చేయడం నచ్చటం లేదా? లేక ఉనికి కోసం ఆరోపణలు చేస్తున్నారా? అనేది ఆలోచించుకోవాలన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక వాడపల్లిలో ఆదాయం కోసం చూడడం లేదని, భక్తులకు సౌకర్యాలు కల్పన పైనే ఎక్కువ దృష్టి సారించామన్నారు.బండారు సత్యానందరావు మీద కోపం ఉంటే వ్యక్తిగతంగా తనపైనే చూపాలని, అంతేకానీ వాడపల్లి దేవాలయం అభివృద్ధిని మాత్రం అడ్డుకోకూడదన్నారు. రాజకీయాల్లోకి దేవాలయ అభివృద్ధిని లాగవద్దన్నారు. ఏమైనా తప్పులు జరిగితే ఛైర్మన్, డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. వాళ్లు తప్పులు సరిదిద్దకపోతే అప్పుడు మాట్లాడాలన్నారు.మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి వాడపల్లి లో ఎక్కడైనా తప్పు జరిగినట్లు అనిపిస్తే నేరుగా రావాలని ఆఫీసులో కూర్చుని దానిపై ప్రశ్నిస్తే వారు తప్పకుండా సమాధానమిస్తారని తెలిపారు. అంతేకానీ వాడపల్లి దేవాలయాన్ని అప్రతిష్ట పాలు చేసేలాగా ప్రవర్తించవద్దన్నారు. ఆత్రేయపురం ఉత్సవానికి జాతీయస్థాయిలో పేరు వస్తే ఆ ఉత్సవం మీద కూడా విమర్శ చేశారన్నారు. ప్రభుత్వం నుంచి ఏ విధమైన నిధులు రాకుండానే, టూరిజం నుంచి నిధులు విడుదల కాకుండానే దోపిడీ ఆరోపణలు చేయటం హాస్యాస్పదంగా లేదా? అని ప్రశ్నించారు. స్పాన్సర్ లిస్టును నేరుగా టీవీ స్క్రీన్ మీద, ఆహ్వాన పత్రిక మీద ప్రకటించామన్నారు. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ అనే కమిటీ ఏర్పాటయిందని, దానికి ఇన్కమ్ టాక్స్ వెసులుబాటు కూడా అప్లై చేశారని, బ్యాంకు ఎకౌంటు కూడా ఉందని,బ్యాంక్ ఎకౌంట్ ద్వారానే లావాదేవీలు జరుగుతున్నాయని అన్నారు. ఆత్రేయపురం ఉత్సవంకు రిజిస్టర్ కమిటీ ఉందని అంతా క్లీన్ గా ఉందన్నారు. ఇది ఒక సంవత్సరంతో ముగించేసేది కాదన్నారు. మొన్న జరిగిన ఉత్సవం, సక్సెస్ కు ఇక్కడ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు,ఐటీ మంత్రి నారా లోకేష్ అభినందించారని, ఇవన్నీ చూసి ఓర్చుకోలేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కరోనా పేరిట ఆలమూరు షిరిడి సాయి ఆలయం వద్ద కూడా చందాలు వసూలు చేసిన ఘనత గత ప్రభుత్వంలో ఉందని, పంచాయతీల్లో బ్లీచింగ్ పేరు చెప్పి బిల్లులు తీసుకున్న ఘనత ఉందని, కరోనా పేరు చెప్పి ఎంత దోచేశారు ఆ భగవంతునికే తెలుసన్నారు.
