తిరుప్పావడ సేవ, లక్షతులసి పూజల్లో ఎమ్మెల్యే
కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన గురువారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు ఆయనకు మేళ తాళాలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష తులసి పూజ, తిరుప్పావడ సేవల్లో పాల్గొన్నారు. ప్రధాన హోమాలు, దిగ్దేవతా బలిహరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్చకులు ఎమ్మెల్యేకు ప్రసాదాలను అందజేశారు. దేవస్థానం నూతనంగా తీసుకువచ్చిన కళ్యాణం లడ్డూను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వాడపల్లి అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో దేవస్థానం చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు. తిరుమల తరహాలో కళ్యాణం లడ్డు భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 450 గ్రాముల బరువుతో రూ.100లకు భక్తులకు కళ్యాణం లడ్డు గురువారం నుంచి భక్తులకు అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఆలయ సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు.