గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు కావాల్సిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా రావులపాలెం సీఆర్సీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంత కుమారి,తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. 400మంది గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించి, వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు చెందిన మహిళలకు సామూహిక సీమంతాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిఆర్సి సభ్యులను అభినందించారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మహిళలు సమతుల్యమైన పోషక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. మన ఇంటి పరిసరాల్లో సేంద్రియ విధానంలో ఆకుకూరలు పండించి వినియోగించుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవని సూచించారు. కిషోర బాలికల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు.అంగన్వాడీ కార్యకర్తలు సేవాభావంతో పనిచేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.