అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన ABN రాధాకృష్ణపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీకి వినతిపత్రం అందజేస్తూ మహిళల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ, మహిళలను కించపరిచేలా మాట్లాడటం కేవలం వ్యక్తిగత వ్యాఖ్య కాదని, అది సమాజంలోని ప్రతి మహిళ గౌరవాన్ని అవమానించే చర్య అని అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియాకు ఉన్న బాధ్యత ఎంతో గొప్పదని, అలాంటి స్థానంలో ఉన్నవారు మహిళలపై తక్కువ చేసి మాట్లాడటం మరింత బాధాకరమని పేర్కొన్నారు.అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, కొత్తపేట నియోజకవర్గం నుంచి పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేకపోవడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలంటే ఇలాంటి ఘటనలపై పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.రాధాకృష్ణ వెంటనే రాష్ట్ర మహిళలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే మాటలు సమాజంలో తప్పు సంకేతాలు పంపుతాయని హెచ్చరించారు. మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసే వారిని సమాజం తిరస్కరించాల్సిన సమయం వచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ కోఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు, అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్‌తో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.