పుస్తకపఠనానికి త్వరలోనే ఆదరణ తిరిగి వస్తుంది పద్య రచనలో గౌరీ మల్లిక్ శైలి ప్రశంసనీయం


హితోక్తి శతకము( త్రిశతి) పుస్తక ఆవిష్కరణలో వక్తలుశ్రీ సిద్ధార్థ పాఠశాలలో పనిచేయడం మా సుకృతంపాఠశాలలో పనిచేసిన పూర్వ ఉపాధ్యాయులుపుస్తక పఠనానికి త్వరలోనే ఆదరణ తిరిగి వస్తుందని, ఇప్పటికే స్పెయిన్ వంటి దేశాల్లో మార్పు మొదలైందని, పద్య రచనలో గౌరీ మల్లిక్ రచనావేగం, శైలి ప్రశంసనీయమని ప్రముఖ రచయిత ఓలేటి బంగారేశ్వర శర్మ ప్రశంసించారు. శనివారం శ్రీ సిద్ధార్థ పాఠశాలలో శ్రీ సిద్ధార్థ కుటుంబం ఆత్మీయ సమ్మేళనం, ప్రముఖ కవి గౌరీ మల్లిక్ రచించిన హితోక్తి శతకము త్రిశతి పుస్తకావిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. గడచిన నాలుగు దశాబ్దాల్లో శ్రీ సిద్ధార్థ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసిన వారంతా ఒక్కచోట చేరి గత అనుభూతులను గుర్తుకు తెచ్చుకున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం శ్రీ సిద్ధార్థ పాఠశాల కరస్పాండెంట్ కె ముల్లారావు, శారద దంపతుల చేతులమీదుగా హితోక్తి శతకము పుస్తకాన్ని ఆవిష్కరించారు. సాహితీ ప్రక్రియలో పద్యానికి ప్రత్యేకత ఉందని, ప్రతిరోజు సూర్యోదయంతో పాటు తన పద్యంతో అందరినీ పలకరించే గౌరీ మల్లిక్ రచన శైలి ప్రశంసనీయమని వక్తలు కొనియాడారు. అంతకుముందు జరిగిన శ్రీ సిద్ధార్థ కుటుంబం ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా గత నాలుగు దశాబ్దాల్లో వివిధ సమయాల్లో పాఠశాలలో పనిచేసిన నాటి ఉపాధ్యాయులు తమ,తమ అనుభవాలను సభ ముందు ఉంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. శ్రీ సిద్ధార్థ పాఠశాల డైరెక్టర్ ముల్లారావు,శారద దంపతులు తమను ఎప్పుడు ఉద్యోగులుగా కాకుండా తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిలా ఆదరించారని గుర్తు చేసుకున్నారు. సిద్ధార్థ పాఠశాలలో విద్యను బోధించే విధానం,క్రమశిక్షణ ఇక్కడ అనుసరించే పద్ధతులు తమ జీవితకాలంలో ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. ఇందుకు కరస్పాండెంట్ ముల్లారావుకు రుణపడి ఉన్నామని, శ్రీ సిద్ధార్థ పాఠశాలలో పనిచేయడం తమ సుకృతంగా వారంతా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలో పని చేసిన ఉపాధ్యాయులు పాఠశాలతో ఇంతటి అనుబంధాన్ని కలిగి ఉండడం ఆశ్చర్యంగా ఉందని పలువురు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.ఈ ఆత్మీయ సమ్మేళనానికి గుర్తుగా గెడ్డం గీతాజ్యోతి సమకూర్చిన మెమంటోలను కరస్పాండెంట్ ముల్లారావు ఉపాధ్యాయులకు ఇచ్చి సత్కరించారు.