ANDRAPRADESH: రాజకీయాల నుంచి విరమణ ప్రకటించారు విజయసాయిరెడ్డి. మూడేళ్ళకు పైగా తన రాజ్యసభ ఎంపీ పదవిని సైతం వదులుకున్నారు. అంతే కాదు ఇక వ్యవసాయం చేసుకుంటాను అని కూడా ఒక సంచలన ప్రకటన చేశారు. అయితే విజయసాయిరెడ్డి రాజకీయాన్ని వదిలేస్తాను అని చెప్పినా అంత సులువుగా వదిలేలా కనిపించడం లేదు. ఆయన బీజేపీలో చేరుతారు అని ఒక వైపు చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే ఆయన వైసీపీలోకి మళ్ళీ వస్తారు అని కూడా అంటున్న వారు ఉన్నారు ఇక విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్ కి పని చెబుతూ ఉంటున్నారు. అందులో తన అభిప్రాయాలను ఆయన ఎప్పటికపుడు రియాక్టు అవుతూనే ఉన్నారు.
మోడీ నినాదానికి మద్దతుగా :
స్వదీశీ వస్తువులనే ప్రోత్సహించాలని తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఆత్మ నిర్భర్ భారత్ అన్నది నిజం చేయలాని 2047 నాటికి భారత్ అన్ని విధాలుగా స్వయం సమృద్ధి సాధించాలని మోడీ గట్టిగా కోరుకుంటున్నారు. అదే విధంగా తాజాగా మారుతీ సుజుకీ ఈ-విటారా కారును ప్రారంభించడంతో పాటు మేక్ ఇన్ ఇండియాకు మద్దతుగా మోడీ మాట్లాడారు.
అమెరికా వ్యూహానికి చెక్ పెట్టేలా :
అమెరికా అధిక సుంకాలతో భారత్ మీద ఒత్తిడి తెస్తోంది. ఏకంగా 50 శాతం దాకా సుంకాలను పెంచేసింది. దాంతో భారతీయ పరిశ్రమలకు చేయూత ఇవ్వడం ఆ ఉత్పత్తులకు దేశంలోనే అధిక గిరాకీ లభించేలా చూడడం ద్వారా అమెరికా అధిక సుంకాల వ్యూహానికి చెక్ చెప్పాలని మోడీ ఆలోచిస్తున్నారు. దాంతో ఆయన మేక్ ఇన్ ఇండియా అని కూడా నినదిస్తున్నారు.
మోడీ భేష్ అంటూ :
మోడీ దేశంలోని ప్రజలకు ఇచ్చిన పిలుపు భేష్ అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. మన వ్యాపారులు, మన చేతి వృత్తుల వారు మన తయారీదారులకు మద్దతుగా ఉందామని కోరుతున్నారు. దాని వల్ల స్వావలంబన సాధిస్తామని ఇది దేశానికి మేలు చేస్తుందని ఆయన చెబుతున్నారు. మోడీ వెంట అంతా నడవాలని విజయసాయిరెడ్డి గట్టిగా కోరుకుంటున్నారు.
చర్చలకు తావిస్తున్నారా :
ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి మళ్ళీ వస్తారా అన్నది చర్చగా ఉంది. ఆయన రాజకీయాలకు అతీతం అని చెబుతున్నా ఎక్కువగా బీజేపీకి మోడీకే మద్దతు ఇస్తున్నారు అని చర్చ సాగుతోంది. పైగా ఆయనకు బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతారు. విజయసాయిరెడ్డి నిజానికి ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎనిమిది నెలలు అయింది. ఆయన చూపు జాతీయ పార్టీ పైనే ఉందని అంటున్నారు. బీజేపీ చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అందుకే ఆయన ఢిల్లీలో తనకు కేటాయించిన క్వార్టర్స్ ని ఖాళీ చేయడంలేదని అంటున్నారు. మోడీకి ఆయన జై కొడుతున్నారు అంటే ఆ పార్టీలోకే అని కొందరు అంటూంటే మంచి విషయం కాబట్టే మద్దతు ఇచ్చారని మరి కొందరు అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి రాజకీయంగా ఏ రూటు ఎంచుకుంటారో లేక ఆయన ముందే చెప్పినట్లుగా వ్యవసాయమే చేసుకుంటారో చూడాల్సి ఉంది అని అంటున్నారు.