అంబాజీపేట : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం, మామిడికుదురు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో 2024–25 సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ప్రతిభా పురస్కార సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే సంఘం ముఖ్య ఉద్దేశం అని అభినందించారు. చదువుకొని ఉద్యోగాలు పొంది ఆగిపోకుండా, సమాజానికి సేవ చేయాలని విద్యార్థులకు సూచించారు.పేద కుటుంబాల నుండి వచ్చిన టెన్త్ మరియు ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించడం గర్వించదగ్గ విషయం అని అన్నారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ చదివి, అంటరానితనాన్ని తట్టుకొని, దేశానికి రాజ్యాంగం అందించడం సొసైటీ కోసం ఆయన చేసిన మహోన్నత కృషికి నిదర్శనమని గుర్తుచేశారు.అలాగే, తాను చదువుకున్న రోజుల్లో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ, సమాజం కోసం సేవ చేయడం తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేయగా, ఇటీవల రిటైర్ అయిన ఉపాధ్యాయులను, ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సన్మానించారు.