ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య పరిరక్షణకు రోజులో కొంతసేపు రన్నింగ్, వాకింగ్ తప్పనిసరని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలియజేశారు. ఆదివారం రావులపాలెంలో కోనసీమ గోదావరి రన్నర్స్ అసోసియేషన్,తేజారెడ్డి మణిహంస దంపతులు నిర్వహించిన 3కె, 5కె, 10కె మారథాన్ రన్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన పాల్గొన్నారు. 10కె, 5కె, 3కె రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బండారు జెండా ఊపి ప్రారంభించారు. కొంత దూరం రన్నింగ్ లో పాల్గొని రన్నర్లను ఉత్సాహపరిచారు. పెద్ద, పెద్ద పట్టణాల్లో జరిగే మారథాన్ రన్ కార్యక్రమాన్ని రావులపాలెంలో నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. నేటి జీవనశైలిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, వాటన్నిటికీ పరిష్కారంగా డాక్టర్లు, పరిశోధకులు క్రమం తప్పని వ్యాయామం అవసరమని చెబుతున్నారన్నారు. అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా రోజులో కొంత భాగం నడక గాని,పరుగు గాని, వ్యాయామం కాని చేయాలని సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉన్న సాధనాలుగా వాకింగ్, రన్నింగ్ అందరూ ఆచరించవచ్చన్నారు. ఆరోగ్య పరిరక్షణకు వాకింగ్, రన్నింగ్ యొక్క ఆవశ్యకతను అందరికీ తెలియజేయడం కోసం, చైతన్యాన్ని పెంపొందించడం కోసం ఇటువంటి 10కె రన్, మారథాన్లు ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో గుత్తుల రాంబాబు, కంఠంశెట్టి శ్రీనివాస్, చిలువూరి సతీష్ రాజు, చిన్నం శ్రీనివాసరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
