శంఖవరం మండలంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రంలో కొలువైన ఆంధ్రా శబరిమలై అయ్యప్పకు మహా అన్నాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణమంతా భక్తుల కిటకిటలతో సందడిగా మారగా కార్తీకమాసం మహా పుణ్యఫలాన్ని పొందేందుకు వేలాది భక్తులు తరలివచ్చారు. నవంబర్ 30న ప్రారంభమైన 18 రోజుల కోటి బిల్వార్చన మహెూత్సాహం ముగియడం, కార్తీక మాసం ఆఖరి బుధవారం కావడంతో అయ్యప్ప స్వామివారిని అర్చక స్వాములు, నంబూద్రీలు వేద మంత్రోచ్చారణలు, భజనలు, మేళ తాలాలు, భక్తుల హరి నామస్మరణల మధ్య అన్నాభిషేకం ఆలయ చైర్మన్ కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామి చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు గురుస్వామి మాట్లాడుతూ కోటి బిల్వార్చన విజయవంతంగా పూర్తి కావడం స్వామివారి అనుగ్రహమేనని, కార్తీక మాసం ఆఖరి బుధవారం అన్నాభిషేకం అయ్యప్ప స్వామి ఆలయానికి అత్యంత ప్రాముఖ్యం గల సంప్రదాయమన్నారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేకంగా సిద్ధం చేసిన అన్నంతో గర్భగుడిలో స్వామివారికి మహాభిషేకం నిర్వహించామని స్వామివారి శిరస్సు నుంచి పాదాల వరకు అన్నం మునిగేలా చేసిన ఈ అభిషేకమే భక్తులకు అత్యంత మంగళకరమైన క్షణం" అని పేర్కొన్నారు. అన్నాభిషేక అనంతరం ఈ పుణ్య ప్రసాదాన్ని వేలాది మంది భక్తులకు అందజేశారు. స్వామివారి అనుగ్రహాన్ని పొందేందుకు దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలివచ్చి, అన్నాభిషేక దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణం నిండా "స్వామియే శరణం అయ్యప్ప" నినాదాలు, శరణు ఘోషతో మార్మోగాయి.

