ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండపేట తహశీల్దార్ కార్యాలయంలో ఆదివారం రెవెన్యూ, సివిల్ సప్లైస్, వ్యవసాయ శాఖల సంయుక్త సమావేశం జరిగింది. మండలంలోని 16 పెట్రోల్ బంకుల యాజమాన్యాలతో జరిగిన ఈ సమావేశంలో డీజిల్ లభ్యత, సరఫరాపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అత్యవసర సేవలైన అంబులెన్స్‌లకు, వ్యవసాయ పనుల నిమిత్తం కోత మిషన్లు, ట్రాక్టర్లకు మొదటి ప్రాధాన్యత క్రమంలో డీజిల్ సరఫరా చేయాలని అధికారులు ఆదేశించారు. రైతులకు డీజిల్ కావాలంటే గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ వ్యవసాయ సహాయకులు సంయుక్తంగా జారీ చేసే కూపన్లు తప్పనిసరి అని స్పష్టం చేశారు.
మండలంలోని 16 పెట్రోల్ బంక్‌లకు ఒక్కో బంక్‌కు ఒక విఆర్ఓ చొప్పున నియమించారు. పెట్రోల్, డీజిల్ నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలని బంక్ యాజమాన్యాలను ఆదేశించారు. పరిస్థితిని బట్టి అవసరమైన చోట పోలీస్ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
డీజిల్ కొరత రాకుండా సంబంధిత ఆయిల్ కంపెనీలకు తరచూ ఇండెంట్‌లు పెట్టుకోవాలని పెట్రోల్ బంక్ యజమానులకు సూచించారు. బంక్ యజమానులు లేవనెత్తిన సమస్యలు, సూచనలను తగు చర్యల నిమిత్తం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో రెవెన్యూ డిప్యూటీ తహశీల్దార్ పి.ఏ.మెహర్ బాబా, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహశీల్దార్ బి. ప్రసన్న జ్యోతి, మండల వ్యవసాయ అధికారి కె.ప్రభాకర్, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ ఎం.పద్మనాభం, మండపేట మండల పెట్రోల్ బంకుల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.
గ్రామ స్థాయిలోలు వి ఆర్ ఓ, వి వి ఏ లు రైతులకు అందుబాటులో ఉండి వ్యవసాయ పనులకు కూపన్లు జారీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.