వైసీపీ నాయకులు తమ రాజకీయ మనుగడ కోసం అన్నదాత పోరు అంటూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల పాటు రైతుల కోసం ఏ మాత్రం ఆలోచించకుండా పాలన చేసిన జగన్ ఇప్పుడు అన్నదాత పోరు అంటూ మొసలి కన్నీరు కార్చడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. రైతుల దెబ్బకే వైసిపి గత ఎన్నికల్లో 11సీట్లకు పరిమితం అయ్యిందని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20వేలు రైతులకు అందిస్తుందన్నారు. ఏ పంట కైనా ధరలు లేకపోతే వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి ధరల స్థిరీకరణ చేసి రైతుల్ని ఆదుకుంటుందన్నారు. మీ హయాంలో కనీసం ఒక్క రైతు కన్నా ఒక తార్పాలిన్ అయినా ఇచ్చారా? ఒక డ్రిప్ ఇరిగేషన్ పథకం అయినా ఇచ్చారా? అని వైసిపి నాయకులను ఆయన ప్రశ్నించారు. వైసిపి హయాంలో యూరియా కోసం రైతులు లైన్లో నిలబడి నానాపాట్లు పడ్డారని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తపేట నియోజకవర్గంలో ఎక్కడా యూరియా కొరత లేదని తెలిపారు.3200 బస్తాలు, సుమారు 144 టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉందన్నారు. వానపల్లి, నర్సిపూడి సొసైటీలకు మరింత యూరియా రాబోతుందని చెప్పారు. నిరంతర సరఫరా జరగనుందన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని ఆలోచించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే వైసీపీ నాయకులు రాజకీయంగా పతనమయ్యారని ఇంకా లేనిపోని జిమ్మిక్కులతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తే ప్రజలు అసహ్యించునే పరిస్థితి దాపురిస్తుందని ఎద్దేవా చేశారు. రైతులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.