రావులపాలెం, అక్టోబర్ 12:
రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధికి దోహదం చేస్తూ, ప్రతిభ–పాటవాలే భూమికగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు.
ఆదివారం రావులపాలెంలో మెగా డీఎస్సీలో ప్రతిభ చూపి ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన కొత్తపేట నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులను సత్కరించే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో పాటు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ చైర్మన్ రెడ్డి అనంత కుమారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ — ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర విద్యా రంగాన్ని ప్రగతిపథంలోకి తీసుకెళ్లిందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు టీచర్ల బదిలీలు, నియామకాలు రాజకీయ ఆధారంగా జరిగేవని గుర్తుచేస్తూ, ఆయన నాయకత్వంలో ప్రవేశపెట్టిన కౌన్సెలింగ్ విధానం ద్వారా ప్రతిభ ఆధారిత నియామకాలకు మార్గం సుగమమైందన్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 10 డీఎస్సీల ద్వారా 2 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులను నియమించిన ఘనత చంద్రబాబు నాయుడిదేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకంగా చేసిన మెగా డీఎస్సీతో నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు నింపిందని చెప్పారు.
డీ ఎడ్, బీ ఎడ్ పూర్తిచేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈ నియామకాలు గొప్ప ఊతమని పేర్కొన్నారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన ప్రకారం — వచ్చే సంవత్సరం మార్చిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతలో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పారు.
ఉపాధ్యాయ నియామకాలతోపాటు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. చంద్రబాబు – పవన్ కళ్యాణ్ – లోకేష్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని, విద్యాభివృద్ధి ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మెగా డీఎస్సీలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులుగా నియోజకవర్గంలో సెలెక్ట్ అయిన 68 మంది అభ్యర్థులను ఘనంగా సత్కరించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారంతా భావితరాల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని ఎమ్మెల్యే ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రావులపాలెం మండల పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి ప్రసాద్, కొత్తపేట మండల గనిశెట్టి వీరేష్, ఆత్రేయపురం మండలం పార్టీ అధ్యక్షులు కుసంపూడి రామకృష్ణంరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల బాబ్జి, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ అయినవిల్లి సత్తిబాబు గౌడ్, రాష్ట బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం,ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు