అరటి, వరి రైతులను ఆదుకుంటాం

రావులపాడులో పంట నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.


మొంథా తుఫానుతో దెబ్బతిన్న అరటి, వరి,ఉద్యాన,కూరగాయల పంటల రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలియజేశారు. రావులపాలెం మండలం రావులపాడులో గురువారం ఆయన తుఫాను కారణంగా నష్టపోయిన అరటి తోటలను పరిశీలించారు. అరటి రైతులతో మాట్లాడారు. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్క అరటి చెట్టుకు రూ.200 వరకు పెట్టుబడి ఖర్చులు అవుతున్నాయని వారు ఎమ్మెల్యేకు తెలిపారు. చెట్లు పడిపోవడంతో పూర్తిగా నష్టపోయామన్నారు. వారి ఆవేదన విని ఎమ్మెల్యే బండారు చలించిపోయారు. తక్షణమే నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందే విధంగా నమోదు కార్యక్రమం చేపట్టాలని వ్యవసాయ అధికారులను, సిబ్బందిని ఆయన ఆదేశించారు. అరటికి ఎకరాకు రూ.14వేలు, వరికి ఎకరాకు రూ.8వేలు, కూరగాయల పంటలకు రూ.10వేలు నష్టపరిహారంగా ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన రైతులకు తెలియజేశారు.నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం తుఫాను గాలులకు పడిపోయిన వరి పొలాలను పరిశీలించారు.