రైతులను ప్రభుత్వం తరపున ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.

 మొంథా తుఫాన్ వల్ల అన్నదాతలకు తీరని నష్టం.

ముందస్తు చర్యలతో సామాన్య ప్రజలకు ఇక్కట్లు తప్పాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతతో ముప్పు తగ్గింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతతో తీసుకున్న ముందస్తు జాగ్రత్తలతో మొంథా తుఫాను వల్ల సామాన్య ప్రజలకు ఇక్కట్లు తప్పాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. గురువారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పూరి గుడిసెలు, రేకుల షెడ్లు, శిథిల భవనాలలో నివాసం ఉంటున్నవారినందరినీ పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, పరిపాలనాదక్షతతో చేసిన ఏర్పాట్ల వల్ల ప్రాణనష్టం గానీ, గాయపడటం గానీ లేకుండా తుఫాను నుంచి ప్రజలంతా బయటపడటం జరిగిందన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉంటున్నవారికి పరిశుభ్రమైన తాగునీరు, భోజనం అందించడం జరిగిందన్నారు. అధికారులను సమాయత్తం చేయడం, ప్రజలందరినీ అప్రమత్తం చేయడంతో యంత్రాంగం చురుకుగా పనిచేసి ప్రజల్ని చైతన్యవంతం చేసిందన్నారు. తుఫాను గాలుల వల్ల దెబ్బతిన్న చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు వెంటనే తొలగించి విద్యుత్ పునరుద్ధరించడం జరిగిందన్నారు. అయితే ఈ తుఫాను వల్ల రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారని వాపోయారు.కొత్తపేట నియోజకవర్గంలో పదివేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని తెలిపారు. మరో 1500 ఎకరాల నుంచి 2 వేల ఎకరాల్లో అరటి,బొప్పాయి, కూరగాయలు, పూలతోటలు దెబ్బతిన్నట్లు అంచనా వేయడం జరిగిందని తెలియజేశారు. వరి ఎకరానికి రూ.8వేలు, అరటికి రూ.14వేలు, పూలు,కూరగాయల పంటలకు ఎకరానికి రూ.10వేలు నష్ట పరిహారంగా అందించడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మంగళవారం తుఫాను వస్తే బుధవారం ఉదయాన్నే ముఖ్యమంత్రి స్వయంగా ఓడలరేవు వచ్చి పునరావాస కేంద్రాన్ని పరిశీలించి అక్కడి వారితో మాట్లాడటం జరిగిందన్నారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న కుటుంబాలకు నిత్యవసర వస్తువులు, మనిషికి రూ.1వెయ్యి, కుటుంబానికి రూ.3వేలు పంపిణీ ప్రారంభించడం జరిగిందన్నారు. గతంలో ఎన్నో ప్రకృతి విపత్తులు సంభవించాయని, ప్రభుత్వం ఈ తుపాను సందర్భంలో అధికార యంత్రాంగాన్నంతా సమాయత్తం చేసి సామాజిక బాధ్యతతో కలిసి పనిచేయడం జరిగిందన్నారు. తుఫాను నుంచి ప్రజలను రక్షించడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సహకారం అందించిన ప్రధాని మోదీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సేవలో ముందున్న ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలకు సైతం కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్తపేట నియోజకవర్గంలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు విస్తృతంగా కృషి చేస్తామని తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చూస్తామన్నారు.ఈ కార్యక్రమంలో గుత్తుల రాంబాబు,పల్లి యేసు,జక్కంపూడి బాలాజీ,కొప్పిశెట్టి ప్రసాద్,కాసా సాగర్ పాల్గొన్నారు.