రావులపాలెంకు నూతన శోభ

 ఐ లవ్ యూ రావులపాలెం త్రీడీ లైటింగ్ తో రావులపాలెంకు నూతన శోభ...

ఒకవైపు కోనసీమ ముఖద్వారం, మరో వైపు వాడపల్లి ముఖద్వారం...

పర్యాటకులను ఆకట్టుకునేలా రావులపాలెం అభివృద్ధి...

కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...

రావులపాలెం కళా వెంకటరావు సెంటర్లో నూతనంగా ఏర్పాటుచేసిన ఐ లవ్ రావులపాలెం త్రీడీ లైటింగ్ సెంటర్ కు, రావులపాలేనికి నూతన శోభను తీసుకువచ్చిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. గురువారం సాయంత్రం ఐ లవ్ రావులపాలెం త్రీడీ లైటింగ్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చారిత్రాత్మకమైన కళా వెంకట్రావు సెంటర్ లో త్రీడీ లైటింగ్ ఏర్పాటు నూతన ఒరవడికి దారి తీసిందన్నారు. దూర ప్రాంతాల నుంచి రావులపాలెంకు ఆర్థిక, వ్యాపార కార్యకలాపాల కోసం ఎందరో వస్తూ ఉంటారని, ఆతిథ్యానికి కూడా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. జాతీయ రహదారిపై వెళ్లేవారినందర్నీ ఈ త్రీడీ లైటింగ్ ఆకట్టుకుంటుందని వ్యాఖ్యానించారు. మరో పక్క ఉభయగోదావరి జిల్లాల ఆరాధ్య దైవమైన కాటన్ మహాశయుని విగ్రహంతో ఏర్పాటు చేసిన కోనసీమ ముఖ ద్వారాన్ని ఆధునీకరణ చేసి అందమైన విద్యుత్ కాంతులు నింపి ప్రారంభించడం కూడా తనకెంతో ఆనందంగా ఉందన్నారు. సెంటర్లో గల కళా వెంకట్రావు విగ్రహాన్ని మరింత ఆధునికరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజమహేంద్రవరం వెళ్ళే ప్రయాణీకుల సౌకర్యార్థం పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రయాణికులకు టాయిలెట్ల తో కూడిన విశ్రాంతి భవనాన్ని (బస్ స్టాప్) నిర్మిస్తామన్నారు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ముఖద్వారం దాదాపుగా పూర్తయిప్రారంభానికి సిద్ధమవుతుందన్నారు. దీనితో రావులపాలెంకు మరింత కళ పెరుగుతుందన్నారు.అలాగే ముఖద్వారంతో పాటు రహదారులను కూడా ఆధునికరిస్తూ డివైడర్ల మధ్యలో అందమైన మొక్కలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో భవిష్యత్తులో రావులపాలెం ప్రాధాన్యతను మరింత ఇనుమడింప చేస్తామన్నారు. పర్యాటకంగా రావులపాలెం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, కె వి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల రాంబాబు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.