
వరి కోతలు జోరుగా సాగుతున్న తరుణంలో డీజిల్ కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. గత మూడు రోజులుగా డీజిల్ కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కోతల కోసం వినియోగించే వరి కోత మిషన్లు, ట్రాక్టర్లకు డీజిల్ అందక పనులు నిలిచిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. కీలక సమయంలో ఇంధనం అందకపోవడం వల్ల పంట నష్టపోతుందనే భయం రైతుల్లో నెలకొంది. ఈ పరిస్థితిని గమనించిన నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యానందరావు వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా పౌరసరఫరా అధికారి (డీఎస్ఓ) ఉదయ భాస్కర్లతో నేరుగా మాట్లాడి రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా డీజిల్ సరఫరా చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులు డీజిల్ కోసం టిన్స్, కేన్ల తెచ్చుకున్న వాటిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా అందించాలని, కోతల సీజన్‌లో ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. రైతుల సమస్యలు అత్యవసరంగా పరిష్కరించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపారు. అధికారులు కూడా స్పందిస్తూ కోతల కాలంలో డీజిల్ కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, రైతులకు నిరంతర సరఫరా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. పంట కోతలకు అంతరాయం లేకుండా చర్యలు… రైతుల్లో నూతన నమ్మకం బండారు జోక్యంతో సమస్య త్వరగా పరిష్కారం దిశగా సాగుతుండటంతో రైతుల్లో ఊరట నెలకొంది. కోతల సీజన్‌లో ఇంధన సరఫరా సక్రమంగా జరిగితే పంట నష్టం తప్పుతుందని, తమ కష్టానికి ఫలితం దక్కుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.